Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వం శిక్షించలేదు.. ప్రజా పోరాటంతో వణికి, శవమై తేలాడు: రాజు ఆత్మహత్యపై సీతక్క స్పందన

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు అనూహ్యంగా శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

Congress mla seethakka comments saidabad rape case accused rajus death
Author
Hyderabad, First Published Sep 16, 2021, 2:34 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటన నిందితుడు రాజు అనూహ్యంగా శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది ప్రజల విజయమని.. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని వారం రోజులుగా చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని.. ప్రభుత్వం పక్కదారి పట్టించే విధంగా వుందన్నారు. ఇప్పటికే పట్టుకున్నామని, పట్టిస్తే పది లక్షలు ఇస్తామని చెబుతూ నిందితుడిని పట్టుకోలేదంటూ సీతక్క మండిపడ్డారు.

ప్రభుత్వం వాడిని శిక్షించలేదని.. ప్రజా పోరాటం ద్వారానే వాడి వెన్నులో వణుకు పుట్టి ఆత్మహత్య చేసుకొని శవమై తేలాడని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు భవిష్యత్తులో ఎవరైనా పాల్పడితే.. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. ప్రజా పోరాటానికి భయపడి చావాల్సిందేనని.. మరొకరు ఇలాంటి తప్పుచేయకుండా ఇదొక పోరాట విజయంగా మనం భావించాలని సీతక్క అభివర్ణించారు. అంతేకాకుండా ఎలాంటి తప్పు చేయని రాజు కుటుంబ సభ్యులను, తన కూతురిని ప్రభుత్వం రక్షించాలి అని సీతక్క ట్వీట్‌లో పేర్కొన్నారు.

ALso Read:సైదాబాద్ మైనర్ బాలికపై రేప్, హత్య: నిందితుడు రాజు ఆత్మహత్య, రైల్వే ట్రాక్ పై శవం

కాగా, సైదాబాద్ మైనర్ బాలిక పై రేప్  చేసి హత్య చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. జనగామ  జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వేట్రాక్ పై ఓ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఈ డెడ్‌బాడీ ఉన్న చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజుగా స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహం చేయిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంది.దాని ఆధారంగా పోలీసులు శవం రాజుదిగా గుర్తించారు. శవాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన రాజు పరారయ్యాడు. అతని కోసం దాదాపు వేయి మంది పోలీసులు గాలింపు చేపట్టారు. చిన్నారి సంఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. రాజకీయ నాయకులు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శిస్తూ వస్తున్నారు. వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. రాజు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios