తాండూరు: తెలంగాణలో కాంగ్రెసు మరో షాక్ తగలనుంది.  వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్‌ రోహిత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటీ రామారావు నుంచి రోహిత్ రెడ్డికి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో 4 రోజుల క్రితం రోహిత్‌రెడ్డి ఆయనను కలసినట్లు సమాచారం. అయితే ప్రాదేశిక ఎన్నికల అనంతరం పార్టీలో చేరుతానని రోహిత్‌రెడ్డి కేటీఆర్‌కు చెప్పినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 

అన్నీ కుదిరితే త్వరలోనే రోహిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి సొంత గూటికి చేరనున్నారు. ఏడాది క్రితం టీఆర్ఎస్ నుంచి బహిష్కణకు గురైన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు.

రోహిత్ రెడ్డి చేరికతో శాసనసభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా గల్లంతయ్యే అవకాశాలున్నాయి. కేంద్రంలో అంచనాలు తలకిందులు కావడంతో టీఆర్ఎస్ మళ్లీ కాంగ్రెసును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.