నల్గొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎట్టకేలకు యూటర్న్ తీసుకున్నారు. బీజేపీలో చేరాలని ప్రయత్నించిన ఆయన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చేసేది లేక మళ్లీ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిన్న మెున్నటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదంటూనే పదేపదే తీవ్ర వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. 

తాను పార్టీపై ఉన్న అభిమానంతో కాస్త తీవ్ర విమర్శలు చేశానని అంగీకరించారు. అవికూడా పార్టీ మనుగడ కోసమే తప్ప వేరే దాని కోసం కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం మారితే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అదే అన్నానని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులతో యుద్ధం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సరిపోరంటూ మాత్రమే చెప్పానన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయాల వల్ల అధికారం కోల్పోయిందని లేకపోతే పరిస్థితి ఇలా ఉండేది కాదని చెప్పుకొచ్చారు. 

ముందస్తు ఎన్నికల సమయంలో నాలుగు గోడల మధ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో అనేకమార్లు కుంతియా సరిపోడు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని పదేపదే కోరామని తెలిపారు. అదేవిషయాన్ని తాను మరోక్కసారి స్పష్టం చేసినట్లు తెలిపారు. 

తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుడుగా అర్థం చేసుకుందని తెలిపారు. తనను సస్పెండ్ చేస్తానంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని దానికి సమాధానంగా బహిరంగ లేఖ రాశానంటూ చెప్పుకొచ్చారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని సైతం విమర్శించిన నేపథ్యంలో ఏఐసీసీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. కోమటిరెడ్డి యూటర్న్  తీసుకున్నా చర్యలు మాత్రం తప్పవంటూ ప్రచారం జరుగుతోంది.