హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీకి మంచి జరగుతుందని అభిప్రాయపడ్డారు. 

చంద్రబాబు విజన్‌ ఉన్న  నాయకుడని, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ చేసిన జగ్గారెడ్డి హైదరాబాద్‌ అభివృద్ధి వెనుక చంద్రబాబు ఘనత ఉందని గుర్తు చేశారు. 

ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్‌ బతికితేనే ప్రజలకు మంచిదన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ కాంగ్రెస్‌ ఇచ్చిందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అప్పుడు హోదా అడగని కేసీఆర్‌ ఇప్పుడు హోదా అడగడం ఏంటని ప్రశ్నించారు. మెదక్‌ నుంచి రాహుల్‌ పోటీ చేయాలని తాను కోరుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ పోటీ చేసినా రాహుల్‌ బంపర్‌ మెజారిటీతో గెలుస్తారని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.