హైదరాబాద్: గాంధీ ఆసుపత్రికి రూ. 3 వేల కోట్లు, జిల్లా ఆసుపత్రులకు రూ. 2 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే తాను ట్యాంక్ బండ్ పై ధర్నా నిర్వహిస్తానని ఆయన హెచ్చరించారు.

సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో కరోనా సోకి అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంగారెడ్డి పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ గౌసియా బేగం కరోనాతో మరణించారని ఆయన తెలిపారు.

also read:తెలంగాణలో 23 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,590 కేసులు, ఏడుగురు మృతి

గత ఐదు రోజులుగా చికిత్స కోసం ఆమె తిరగని ప్రైవేట్ ఆసుపత్రి లేదంటూ ఆయన గుర్తు చేసుకొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ లేని కారణంగా చివరకు గాంధీ ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన వివరించారు. ఆక్సిజన్ లేక కౌన్సిలర్ గౌసియా బేగం మరణించారని ఆయన చెప్పారు.

కరోనా నుండి  కోలుకొన్నవారికి ఫోన్ చేయడం కాదు, కరోనాతో చికిత్స పొందుతున్న వారికి ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో తక్షణమే లక్ష వెంటిలేటర్లు, 2 లక్షల ఆక్సిజన్ కిట్స్ ను ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.