రోజూ వెయ్యి కరోనా కేసులు మామూలు విషయం కాదు: జగ్గారెడ్డి
రాష్ట్రంలో ప్రతి రోజూ వెయ్యి కరోనా కేసులు నమోదు కావడం మామూలు విషయం కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి రోజూ వెయ్యి కరోనా కేసులు నమోదు కావడం మామూలు విషయం కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు.
గురువారం నాడు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాటలకే పరిమితమయ్యారని ఆయన విమర్శించారు.
ప్రజలు రోడ్లు, డ్రైనేజీలు అడగడం లేదు, తమ ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారని ఆయన చెప్పారు.గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో బెడ్స్ ఉన్నా కూడ కరోనా రోగులను ఎందుకు చేర్చుకోవడం లేదో చెప్పాలని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కల్గిస్తోందన్నారు. కరోనా నివారణకు దాతలు ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రులతో పాటు హైద్రాబాద్ లోని కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఆసుపత్రులకు నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య బుధవారానికి 17 వేలకు చేరుకొన్నాయి. బుధవారం నాడు ఒక్క రోజే 1018 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదౌతున్నాయి.