Asianet News TeluguAsianet News Telugu

మూడు రాజధానుల నిర్ణయం సరికాదు.. ఆ రోజు మేమే ఎక్కువగా ఏడ్చాం: జగన్, షర్మిలపై జగ్గారెడ్డి సంచలన కామెంట్స్..

ఏపీ సీఎం వైఎస్ జగన్, వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దనేదే వారి ప్రయత్నం అన్నారు. 

Congress MLA Jagga Reddy sensational comments on ys jagan and YS Sharmila
Author
First Published Sep 26, 2022, 3:37 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జగ్గారెడ్డి.. జగన్ సర్కార్ నిర్ణయాన్ని ఖండించారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని సూచించారు. అధికారంలో లేనప్పుడూ ఎలా నడుచుకున్న ఎవరూ పట్టించుకోరని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయాన్ని ఎవరూ అంగీకరించరని అన్నారు. తాను ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. 

అలాగే ఏపీకి రాజధానిగా అమరావతి ఉండాలని అన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదని.. దాని వల్ల అభివృద్ది సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో జగన్ నిర్ణయం తప్పని అన్నారు. అమరావతిపై చంద్రబాబు దృక్పథంతో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్, వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దనేదే  వారి ప్రయత్నం అన్నారు. షర్మిలకు రాజకీయ అవగాహన లేదని అన్నారు. షర్మిల అడుగడుగునా మాట మారుస్తున్నారని మండిపడ్డారు. షర్మిల గతంలో జగన్ వదిలిన బాణంఅని.. ఇప్పుడు వైఎస్సార్ వదిలిన బాణం అని చెబుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. షర్మిల బాణాలను మార్చినప్పుడు.. తాము అనకూడదా? అని ప్రశ్నించారు. తండ్రి పేరును వాడుకుని నాయకులు కావాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. షర్మిల అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. 

రాజశేఖరరెడ్డి కూతురు అయితే మాత్రం తిడితే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. షర్మిల బీజేపీ బాణం అని తనకు అనుమానంగా ఉందన్నారు. షర్మిల బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. బీజేపీ డైరెక్షన్‌లో వైఎస్ జగన్, షర్మిల పనిచేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు గుట్టు రట్టు కాకుండా ఉండేందుకే బీజేపీ కంట్రోల్‌లో పని చేస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని వైఎస్ కోరుకున్నారని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టింది వైఎస్సారేనని అన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్న తనను కాంగ్రెస్‌లోకి తెచ్చింది వైఎస్సారేనని గుర్తుచేశారు. వైఎస్‌పై తమకు అభిమానం ఉందని.. జగన్, షర్మిలకు లేదని ఆరోపించారు. షర్మిల తమను తిట్టడం కాదని.. ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని సూచించారు. తాను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలకు తెలుసని.. వైఎస్సార్‌ను తిట్టిపించేలా వ్యవహరించకండని హెచ్చరించారు. 

వైఎస్సార్‌ చనిపోయిన రోజు కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు, తాను కూడా చాలా ఏడ్చానని చెప్పారు. వైఎస్సార్‌ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు తాను, మిగిలిన నేతలు క్యాంప్ ఆఫీసుకు వెళ్లామని.. కానీ అక్కడ కుటుంబ సభ్యులే తమని ఓదార్చేలా పరిస్థితి ఉందని చెప్పారు. లోపల ఎవరూ ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. వాళ్లను ఓదార్చుదామని వెలితే.. వాళ్లే మమ్మల్ని ఓదార్చారని అన్నారు.

టీపీసీసీ రేవంత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. ఇటీవల రేవంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు కాంగ్రెస్‌‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిండని అన్నారు. చంద్రబాబు ఒకప్పుడు కాంగ్రెస్ మనిషని.. ఆయన అవతలి దిక్కుపోయిండని చెప్పారు. తాను అవతి దిక్కు నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చానని అన్నారు. తాను బిడ్డలాంటోని కాదని.. కాంగ్రెస్‌లోకి కోడలి లాగా వచ్చానని రేవంత్‌ రెడ్డి అన్నారు. దీనిపై స్పందించిన జగ్గారెడ్డి.. రేవంత్ వ్యాఖ్యాల్లో తప్పులేదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా అని అన్నారు. రాజశేఖర రెడ్డి కూడా రెడ్డి కాంగ్రెస్‌కు పోయిండు కదా అని గుర్తుచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios