హైదరాబాద్: దుబ్బాకలో లక్షఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుస్తాడని చెప్పిన హరీష్ రావు ఇప్పుడేమంటారని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.ట్రబుల్ షూటర్ ట్రబుల్ లో పడ్డారని ఆయన సెటైర్లు వేశారు. దుబ్బాకలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హరీష్ రావు రాజీనామా చేయాలని ఆయన కోరారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అంతర్గత స్వేచ్ఛే కాంగ్రెస్ ను దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. యువ నాయకత్వంతో రెండో కోర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు.చివరిక్షణంలో అభ్యర్ధిని ప్రకటించడంతో తమకు నష్టం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ నుండి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో టికెట్టు దక్కకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

టీఆర్ఎస్ టిక్కెట్టును శ్రీనివాస్ రెడ్డి ఆశించారు. కానీ సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాతకే కేసీఆర్ టికెట్టు ఇచ్చారు.  టీఆర్ఎస్  టిక్కెట్టు దక్కని కారణంగా శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడని మంత్రి హరీష్ రావు విమర్శించిన విషయం తెలిసిందే.