మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమను తక్షణమే ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ 36 గంటల నిరవధిక నిరహార దీక్షకు దిగారు. బయ్యారంలో ఉక్కుకర్మాగారం ఏర్పాటు చేస్తామని ఆనాటి ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. 

రాష్ట్రప్రభుత్వం ఉక్కు కర్మాగారంపై శ్రద్ధ చూపడం లేదని ఆమె ఆరోపించారు. తక్షణమే ఉక్కు కర్మాగారంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని స్పష్టం చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. హరిప్రియ దీక్షకు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మద్దతు పలికారు. 

అలాగే టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి, ఉక్కు సాధన కమిటీ, సేవాలాల్‌సేనలు ఎమ్మెల్యే దీక్షకు సంఘీభావం ప్రకటించాయి. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి హరిప్రయ దీక్ష శిబిరానికి చేరుకుని ఆమెకు మద్దతు ప్రకటించారు. 

కాంగ్రెస్ పార్టీతోనే ఉక్కు కర్మాగారం కల సాకారమవుతుందని నేతలు చెప్పుకొచ్చారు. మరోవైపు హరిప్రియ దీక్షను అడ్డుకునేందుకు తుడుందెబ్బ నాయకులు ప్రయత్నించగా వారిలో 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఇకపోతే హరిప్రియ 36 గంటల నిరవధిక నిరాహార దీక్ష గురువారంతో ముగియనుంది. ఆమె దీక్షను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విరమింపజేయనున్నారు.