మునుగోడు ఉపఎన్నికకు నియమించిన పార్టీ ఇంచార్జ్‌లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మార్పులు చేస్తుంది. కొందరు ముఖ్య నాయకులను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తుంది.
మునుగోడు ఉపఎన్నికకు నియమించిన పార్టీ ఇంచార్జ్‌లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మార్పులు చేస్తుంది. కొందరు ముఖ్య నాయకులను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తుంది. మునుగోడు ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే తెలంగాణలో రాహుల్ పాదయాత్ర సాగుతుండటమే ఇందుకు కారణం. తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు కో-ఆర్డినేటర్‌గా ఉన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సీనియర్ నేత షబ్బీర్ అలీలను.. మునుగోడు ఇంచార్జ్‌ల బాధ్యతల నుంచి వెనక్కి పిలిపించారు.
దామోదర రాజనరసింహా ఇంచార్జ్‌గా ఉన్న నాంపల్లి మండల బాధ్యతలను ములుగు ఎమ్మెల్యే సీతక్కకు అప్పగించారు. చౌటుప్పల్, చండూరు మండలాల ప్రచార బాధ్యతలను ఇతర సీనియర్ నేతలకు అప్పగించాలని టీపీసీసీ భావిస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక, మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. గతానికి భిన్నంగా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందే పాల్వాయి స్రవంతిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. నియోజకవర్గంలోని మండలాలకు పార్టీ ఇంచార్జ్‌లను నియమించింది. నారాయణపూర్ ఇంచార్జ్‌గా రేవంత్ రెడ్డి, చౌటుప్పల్ ఇంచార్జ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఇంచార్జ్‌గా భట్టి విక్రమార్క, నాంపల్లి ఇంచార్జ్‌గా దామోదర రాజనరసింహా, మర్రిగూడ ఇంచార్జ్‌గా శ్రీధర్ బాబు, చండూరు ఇంచార్జ్‌గా షబ్బీర్ అలీ, గట్టుప్పల్ ఇంచార్జ్‌గా వీహెచ్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి గీతారెడ్డిలను ఇంచార్జ్లుగా నియమించింది. అయితే ఈ నెల 23న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో.. మునుగోడులో మండలాల ఇంచార్జ్‌లలో టీ కాంగ్రెస్ మార్పులు చేసింది.
