హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ  మంగళవారం నాడు ప్రకటించనుంది. ఎమ్మెల్సీ పదవికి ఎవరిని అభ్యర్థిగా  ప్రకటించాలనే విషయమై సోమవారం నాడు జరిగిన సమావేశంలో నేతలు ఏకాభిప్రాయానికి రాలేదు.

తెలంగాణలో శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీలో ఐదు స్థానాలకు ఈ ఏడాది మార్చి 12వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాలుగు, మిత్రపక్షమైన ఎంఐఎంకు మరో స్థానాన్ని కేటాయించింది.

కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే  కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ పదవికి ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలనే విషయమై తర్జన భర్జన పడుతోంది.

ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమావేశానికి సభ్యులు సకాలంలో హాజరుకాకపోవడంతో సోమవారం నాడు ఉదయం సమావేశం జరగలేదు. అసెంబ్లీ ముగిసిన తర్వాత సబ్ కమిటీ సమావేశంలో సభ్యులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఎవరిని నిలపాలనే విషయమై చర్చించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఈ ఎన్నికల్లో అభ్యర్ధిగా బరిలోకి దింపాలని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఒక్క స్థానం కోసం కనీసం 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్లే ఉండడం గమనార్హం.

మంగళవారం నాడు ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది.మరో వైపు తాము గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడ టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని బరిలోకి దింపడంపై కాంగ్రెస్ నేతలు అంతర్మధనం చెందుతున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమకు మద్దతిచ్చేలా ఆ పార్టీ చీఫ్ చంద్రబాబుతో  నేతలు చర్చించినట్టు సమాచారం.

టీఆర్ఎస్ ఐదో అభ్యర్థిని బరిలోకి దింపడం... క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేకపోలేదనే అనుమానాలు కూడ కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమౌతున్నాయి.  ఈ విషయమై పకడ్బందీగా అడుగులు వేయాలని  కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.