టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమైంది. తెలంగాణ సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తయినట్లు శాసనసభ సచివాలయం గురువారం నోటీఫికేషన్ జారీ చేసింది. సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ కాంగ్రెస్‌‌ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుర్తుపై గెలిచారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సారథ్యంలో కొనసాగుతుండగానే... ఆ 19 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరుతున్నట్లు ప్రకటించారు.

తాజాగా తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్‌లో చేరికపై చర్చించారు. దీంతో సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు అవసరమైన సభ్యులు సమకూరినట్లయ్యింది. దీంతో ఎంఐఎం ఏడుగురు ఎమ్మెల్యేలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి.. ప్రతిపక్షహోదాను దక్కించుకోనుంది.