Huzurabad bypoll Result 2021... కాంగ్రెస్ లో 'చిచ్చు', రేవంత్‌పై సీనియర్ల ముప్పేట దాడి
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రేపాయి. రేవంత్ రెడ్డిపై కొందరు సీనియర్లు విమర్శలు గుప్పించారు. ఘోర పరాజయంపై కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో సీనియర్లు రేవంత్ ను లక్ష్యంగా చేసుకొనే అవకాశం లేకపోలేదు
హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చును రేపాయి. ఆ పార్టీకి కేవలం 3 వేల ఓట్లు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఓటమికి తానే బాధ్యత వహిస్తున్నట్టుగా టీపీసీసీ చీఫ్ Revanth Reddy ప్రకటించారు. మరో వైపు ఈ ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్ సమావేశంలో Huzurabad bypoll ఉప ఎన్నికల్లో ఘోర ఓటమిపై చర్చించనున్నారు.
also read:కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజల విజయం: హుజూరాబాద్ ఫలితంపై ఈటల రాజేందర్
కనీసం 20 నుండి 25 వేల ఓట్లు వస్తోందని తొలుత Congress నేతలు అంచనా వేశారు. ఆ మేరకు ఓటింగ్ ను రాబట్టుకొనేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి ఈ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోకోపవడం కూడా పార్టీ ఘోర ఓటమికి కారణమని కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీగానే ప్రజలు భావించిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తమకు తక్కువ ఓట్లు వచ్చాయని మరికొందరు నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఈ ఫలితాన్ని ఆసరాగా చేసుకొని రేవంత్ రెడ్డిపై విమర్శల దాడిని పెంచేందుకు మరికొందరు నేతలు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశాన్ని వేదికగా ఎంచుకోనున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తొలి నుండి అంత సీరియస్ గా తీసుకొన్నట్టుగా కన్పించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత Balmuri Venkat ను ఆ పార్టీ ప్రకటించింది. అయితే కీలక నేతలు ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన Koushik Reddyకి 61 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 3 వేల ఓట్లకు మాత్రమే పరిమితమైంది.ఈ ఉప ఎన్నికల్లో తొలి నుండి Bjp, Trs మధ్య పోటీగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ ఎన్నికను అంత పెద్దగా పట్టించుకొన్నట్టుగా కన్పించలేదు.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలస్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలు పరోక్షంగా బీజేపీకి మద్దతును ప్రకటించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ శ్రేణులు పనిచేసినట్టుగా కన్పించింది. ఈ కారణంగానే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ డైవర్ట్ అయ్యేలా ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం ప్రయత్నించిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
శతృవుకు శతృవు మిత్రుడు. ఈ కారణంగానే తాము బీజేపీకి మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ Komatireddy Venkat Reddy వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ ఎన్నికల్లో డిపాజిట్ వస్తే రేవంత్ రెడ్డి ప్రతిభ, డిపాజిట్ రాకపోతే సీనియర్ల తప్పిదమని రేవంత్ రెడ్డి అనుచరులు ప్రచారానికి సిద్దంగా ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. బల్మూరి వెంకట్ ను రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలు బలి పశువును చేశారని ఆయన ఆరోపించారు.
ఈ ఉప ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ నేతలు రేవంత్ ను లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఇవాళ జరిగే పొలిటికల్ ఎఫైర్స్ సమావేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై సీనియర్లు ప్రశ్నించనున్నారు.
రేవంత్ రెడ్డి తీరుపై మొదటి నుండి అసంతృప్తిగా ఉన్న కొందరు సీనియర్లు ఈ ఫలితాలను ఆసరాగా తీసుకొని ఈ సమావేశంలో రేవంత్ తీరును ఎండగట్టే అవకాశం లేకపోలేదు. ఈ సమావేశానికి బల్మూరి వెంకట్ ను కూడా రావాలని Manickam Tagore ఆహ్వానం పంపారు. ఈ ఎన్నికల్లో పార్టీకి చెందిన నేతలు ఎవరెవరు సహకరించారు.. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులపై ఠాగూర్ వెంకట్ నుండి సమాచారం తీసుకోనున్నారు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొన్నారని కొందరు సీనియర్లు ఈ విషయమై ఠాగూర్ కు ఫిర్యాదు చేశారు. ఇవాళ సమావేశం హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉంది.