కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ జనగామ అసెంబ్లీ టికెట్‌ను మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఇవ్వొద్దని కోరుతూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ ఎదుట బుధవారం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. 

చేర్యాల మండలం వీరన్నపేటకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి ఆధ్వర్యంలో జనగామ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వేమళ్ల సత్యనారాయణరెడ్డితో పాటు పలువురు తాజా మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు పొన్నాలపై ఫిర్యాదు చేసినట్లు మొగుళ్ల రాజిరెడ్డి తెలిపారు. 

పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజల గురించి నాలుగేళ్లుగా పట్టించుకోలేదని పేర్కొన్నారు. 75సంవత్సరాల వయసు ఉన్న ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని, ఇస్తే పార్టీ నష్టపోవాల్సి వస్తుందన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్‌ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.