హైదరాబాద్: లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై ను కోరినట్టుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

శుక్రవారం నాడు రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై తో భేటీ అయిన తర్వాత  ఆయన మీడియాతో మాట్లాడారు.కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని తాము గవర్నర్ ను కోరినట్టుగా ఆయన చెప్పారు.

మంథనిలో శీలం రంగయ్య పోలీస్ లాకప్ డెత్ జరిగితే  వామనర్ రావు దంపతులు కేసు వేశారన్నారు. ఈ కేసు వేసినందుకు పోలీసులే వామన్ రావు దంపతులను బెదరించారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

లాయర్ వామన్ రావు దంపతుల కేసును పోలీసులు నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మంథని ప్రాంతంలో చోటు చేసుకొన్న అన్యాయాలు, అక్రమాలను నిరసిస్తూ వామన్ రావు దంపతులు ప్రశ్నించారని ఆయన చెప్పారు.

వామన్ రావు దంపతుల హత్యను న్యాయవ్యవస్థపై దాడిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.పుట్ట మథు జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా కొనసాగడాన్ని వీల్లేదని వామన్ రావు దంపతులు కోర్టుల్లో కేసు వేశారన్నారు.
పుట్టమధుకు సీఐ గులాంగిరి చేస్తున్నారని ఆయన విమర్శించారు. వామన్ రావు హత్యపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.