తెలంగాణలో రేపు (మంగళవారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని కాంగ్రెస్ నాయకులు డిజిపి మహేందర్ రెడ్డిని కోరారు. తమ పార్టీకి చెందిన నాయకులపై మళ్లీ దాడులు జరిగే అవకాశం ఉందని వారు డిజిపికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిజిపిని కలిసిన వారిలో మాజీ ఎంపి మధు యాష్కి, గూడూరు నారాయణ రెడ్డి లు ఉన్నారు. 

ఈ సందర్భంగా యాష్కి మాట్లాడుతూ...పోలింగ్ కు ముందు, పోలింగ్ రోజు తమ పార్టీకి చెందిన కీలక నాయకులపై ప్రత్యర్థులు దాడి చేసిన విషయాన్ని మరోసారి డిజిపికి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.. ఇలా  దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు రేపు కౌటింగ్ కేంద్రాల వద్ద గందరగోళ పరిస్థితులు సృష్టించవచ్చని...కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై బౌతిక దాడులకు దిగవచ్చని తమకు అనుమానం ఉందన్నారు. అందువల్ల భద్రత కల్పించాలని డిజిపిని కోరినట్లు యాష్కి వెల్లడించారు. 

తమ పిర్యాదుపై డిజిపి సానుకూలంగా స్పందించారని...ఎలాంటి దాడులు జరక్కుండా చూసుకుంటామని హామీ  ఇచ్చారని యాష్కి వెల్లడించారు. అలాగే  గతంలో జరిగిన దాడుల వివరాలు, తీసుకున్న చర్యలను కూడా ఆయన తమకు వివరించినట్లు తెలిపారు. 

పోలింగ్ కు ముందురోజు కాంగ్రెస్ మాజీ ఎంపీలు మధుయాష్కి, పొన్నం ప్రభాకర్ లపై దాడులు జరిగాయి. అలాగే పోలింగ్ రోజు అభ్యర్ధులు వంశీచంద్ రెడ్డి, రోహిత్ రెడ్డిలపై కూడా దాడులు జరిగాయి. ఇలా మళ్ళీ ఓట్ల లెక్కింపు రోజున కూడా జరగవచ్చని అనుమానించిన కాంగ్రెస్ నాయకులు ముందస్తుగానే డిజిపిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు.