హైదరాబాద్‌: కాంగ్రెసు పార్టీని తెలంగాణలో ఖాళీ చేయడం ద్వారా బలోపేతం కావాలనే వ్యూహరచనను బిజెపి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా బిజెపి కాంగ్రెసు నాయకులకు గాలం వేస్తోంది. తెలంగాణలోని బలమైన సామాజిక వర్గాన్ని తన వైపు లాక్కునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

కొంత మంది కాంగ్రెస్‌ మాజీ శాసనసభ్యులతో బిజెపి నేతలు తాజాగా సంప్రదింపులు ప్రారంభించారు. ఉమ్మడి మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు వారిలో ఉన్నట్లు సమాచారం. వారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కొద్దిరోజుల క్రితం కలిసినట్లు సమాచారం. మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బిజెపి ముఖ్య నేతలతో ఇప్పటికే పలు మార్లు సమావేశమయ్యారు. 

చేరికల వ్యూహాన్ని ముమ్మరం చేయాలని, ముందుకు వచ్చే అందరినీ చేర్చుకోవాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డాలు తమను కలిసిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు చెప్పినట్లు సమాచారం. మల్కాజిగిరి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, మహబూబాబాద్‌ మాజీ ఎంపీ బలంరాంనాయక్‌ బిజెపి నేతలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సర్వే దాదాపుగా బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దిరెడ్డి, చాడా సురేష్‌రెడ్డి, బోడ జనార్దన్‌ సహా పలువురు నేతలు త్వరలో బిజెపిలో చేరే అవకాశం ఉంది. టీడీపి మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా బిజెపి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.