Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పెరుగుతున్న మహిళల మిస్సింగ్ కేసులు... విజయశాంతి సీరియస్

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న మహిళల మిస్సింగ్ కేసులపై విజయశాంతి సీరియస్ అయ్యారు. 

congress leader vijayashanthi serious on womans missing cases in telangana
Author
Hyderabad, First Published Nov 5, 2020, 10:21 PM IST

హైదరాబాద్: తెలంగాణలో మహిళల మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికన ఈ విషయంపై స్పందిస్తూ ఈ మిస్సింగ్ కేసులను టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకోవాలని విజయశాంతి సూచించారు. 

విజయశాంతి కామెంట్స్ యదావిధిగా: 

 తెలంగాణలో నానాటికీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అక్టోబర్ 30 నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే, అప్పటికి నాలుగు రోజుల కిందటి డేటా ప్రకారం సుమారు 200 మంది కనిపించకుండా పోయినట్లు పోలీస్ శాఖ అధికారిక వెబ్ సైటు వెల్లడించిందని మీడియా తెలిపింది. అయితే, ఒకే రోజున ఏకంగా 65 మంది వరకూ మిస్ అయినట్టు రికార్డవడం మరీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ పరిణామాలు తెలంగాణ సమాజంలో కలవరానికి దారి తీయకముందే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి. ఈ మిస్సింగ్ కేసుల్లో కొద్ది శాతం వ్యక్తిగత, కుటుంబ సంబంధ కారణాలను కలిగి ఉండవచ్చు కానీ.... అత్యధిక కేసుల్లో నేరపూరిత కోణాలను కొట్టిపడేయలేం. గతంలో ఎందరో అభాగ్యులు ఇలాగే కనిపించకుండా పోయి సీరియల్ క్రైమ్స్ చేసే నేరగాళ్ళు, కామాంధుల బారిన పడిన ఘటనలు చూశాం. మాటలతో వివరించలేని రీతిలో పసి మొగ్గల్ని, బాలికల్ని, మహిళల్ని హింసించి బలి తీసుకున్న వ్యధలెన్నో మనం విన్నాం. మిస్సింగులతో ముడిపడిన నేరాలు తర్వాత ఎప్పుడో బయటకొస్తున్నాయి. దారుణమైన అకృత్యాలు జరిగేదాకా నిర్లక్ష్య ధోరణితో ఉండి... నెత్తిమీదకు వచ్చినప్పుడు ఏదో ఒక ఎన్‌కౌంటర్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి తెచ్చుకోవడం ఈ సర్కారు విధానంగా మారింది. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా ఈ మిస్సింగ్ కేసులను సీరియస్‌గా తీసుకుని, కేసు నమోదైన వెంటనే పోలీస్ శాఖ స్పందించేలా ఒక వ్యవస్థను రూపొందించాలి. అలా చేస్తే... జరగబోయే ఘోరాల్ని అరికట్టి ఎందరో బాధితుల్ని కాపాడే అవకాశముంటుంది. పరిపాలన పరంగా టీఆరెస్ వైఫల్యాల ప్రభుత్వమే అయినా... ప్రజా క్షేమం దృష్ట్యా ఈ బాధ్యతలైనా సక్రమంగా నిర్వర్తించాలని తెలియజేస్తున్నాను.

విజయశాంతి

Follow Us:
Download App:
  • android
  • ios