టాలీవుడ్ హీరో నాగార్జున అక్రమ భూములను లాక్కుంటారా అంటూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ని కాంగ్రెస్ పార్టీ మహిళానేత విజయ శాంతి ప్రశ్నించారు. రెవిన్యూ శాఖన ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి తాజాగా స్పందించారు. 

‘‘కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్లు, రెవిన్యూ రికార్డులను తారుమారు చేయడం ఇదే మొదటి సారి అయినట్లు, దాన్ని కేసీఆర్ గారే కనిపెట్టి, చర్యలు తీసుకున్నట్లు నానా యాగీ చేస్తున్నారు. ఈ ఐదేళ్లుగా రెవిన్యూ శాఖకు సంబంధించి ఇలాంటి ఫిర్యాదులు ఏమీ సీఎం దృష్టికి రాలేదా?’’ అని విజయశాంతి ప్రశ్నించారు.

రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేయడం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా ఆచరణలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆమె చెప్పారు.  గతంలో గ్యాంగ్ స్టర్ నయీం వివాదంపై రాద్ధాతం చేసి, టీఆరెస్ ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసిందని గుర్తు చేశారు. సెలబ్రెటీల డ్రగ్స్ కేసు కూడా రోజుకి ఒకరిని విచారించి తర్వాత దానిని కూడా వదిలేశారని చెప్పారు.

‘‘సినీ హీరో నాగార్జున అక్రమంగా భూములను రెగులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేదని తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రెవిన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగానైనా హీరో నాగార్జున అక్రమంగా కొన్న భూములపై చర్యలు ఉంటాయా అని వారు నిలదీస్తున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు.

‘‘ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ హీరో నాగార్జున హైదరాబాద్ శివార్లలోని భూములను అక్రమంగా సొంతం చేసుకున్నారని, టీఆరెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని ఇప్పటి సీఎంగారు అప్పట్లో హెచ్చరించారు. మరి ఆ హెచ్చరికలు ఏమైనట్లు’’ అని విజయశాంతి ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.