తెలంగాణ ఎన్నికల ప్రచార తేదీ గడువు ముగియడానికి మరెంతో దూరంలోలేదు.  దీంతో.. స్టార్ క్యాంపైనర్లంతా  ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి మంగళవారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణ ఏర్పాటు చేశాక.. తననే సీఎం చేయాలని కేసీఆర్.. సోనియాగాంధీని అడిగిన విషయాన్ని విజయశాంతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే.. కేసీఆర్ అభ్యర్థనను సోనియా తోసిపుచ్చి.. అతనిని గెంటివేసినట్లు ఆమె చెప్పారు. ‘‘నువ్వు వద్దు.. నీ పార్టీ వద్దు’’ అని సోనియా కేసీఆర్ తో అన్నారని విజయశాంతి వెల్లడించారు.

తెలంగాణ రాకముందు దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. తెలంగాణ రాగానే.. తనను సీఎం చేయాలని సోనియాను అడిగారన్నారు. టీఆర్ఎస్ అన్యాయాలను అడ్డుకుంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల బలిదానాలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆమె చెప్పారు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ లో సీట్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.