హైదరాబాద్ గోల్కొండ హోటల్‌లో జరిగిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం గురించి తనకు తెలియదన్నారు టీపీసీసీ నేత విజయశాంతి. తాను ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతల వరకే పరిమితమని ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుతం వరకు తాను సోనియా గాంధీ గౌరవించి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న సాధారణ కార్యకర్తను మాత్రమేనని ఆమె తెలిపారు. కోర్ కమిటీ సమావేశానికి తాను హాజరుకాకపోవడం గురించి మీడియా ప్రతినిధులు అడుగుతుండటంతో విషయాన్ని తెలియజేస్తున్నట్లు విజయశాంతి పేర్కొన్నారు.

కాగా తెలంగాణలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం, టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం తదితర పరిణామాల నేపథ్యంలో హైకమాండ్ టీపీసీసీపై దృష్టి పెట్టింది. గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం పెట్టిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇక్కడి విషయాలపై వివరించారు. దీంతో కొద్దిరోజుల్లో టీపీసీసీలో ప్రక్షాళన జరిగే అవకాశం కనిపిస్తోంది.