హైదరాబాద్: కోవర్టులను బయటకు పంపకపోతే  పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు.

గురువారం నాడు ఆయన హైద్రాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్యారాచూట్ నేతలను నమ్ముకోవద్దని పార్టీ నాయకత్వం చేసిన సూచనలను పట్టించుకోలేదన్నారు.

ప్యారాచూట్ వాళ్లకు పార్టీలో చోటు లేదని రాహుల్ గాంధీ చెప్పారు. కానీ, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని వీహెచ్ ఆరోపించారు.ఎమ్మెల్యే టిక్కెట్టు కావాలంటే డబ్బులున్నాయా...అని ఆరా తీసి టిక్కెట్లు ఇస్తే ఇలానే ఉంటుందని వీహెచ్ పార్టీ నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ఆర్ స్పూర్తి  అంటే ఏమిటని వీహెచ్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ ఏపీలో అధికారంలో ఉందని వీహెచ్ చెప్పారు. వైఎస్ఆర్ స్పూర్తితో వైఎస్ జగన్ మాదిరిగా గ్రామాల్లో పర్యటిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంకల స్పూర్తి అని ఎందుకు చెప్పరని ఆయన ప్రశ్నించారు. జగన్‌‌తో పనులు కావాలంటే ఏపీలో పనులు చేయించుకోవాలని వీహెచ్ అభిప్రాయపడ్డారు.