వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరం: రేణుకా సంచలనం

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 27, Aug 2018, 3:16 PM IST
congress leader renuka chowdhury sensational comments
Highlights

నవ్వి నేను  నిజాన్ని నిలబెట్టాను.. నా నవ్వుతో  మోడీ కుమిలిపోయాడు. అందుకే రాజ్యసభలో నా నవ్వుపై మోడీ కించపర్చేలా వ్యాఖ్యానించారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి చెప్పారు. 


హైదరాబాద్: నవ్వి నేను  నిజాన్ని నిలబెట్టాను.. నా నవ్వుతో  మోడీ కుమిలిపోయాడు. అందుకే రాజ్యసభలో నా నవ్వుపై మోడీ కించపర్చేలా వ్యాఖ్యానించారని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి చెప్పారు.  ఈ ఘటన జరిగిన తర్వాత కూడ మోడీకి ఎదురెళ్లి తాను నవ్వానని ఆమె గుర్తు చేసుకొన్నారు.అవసరమైతే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ఆమె చెప్పారు.

ఓ తెలుగున్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆమె పలు విషయాలపై  స్పందించారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాల సమయంలో  రేణుకాచౌదరి మోడీ ప్రసంగిస్తున్న సమయంలో రేణుకాచౌదరి పదే పదే అడ్డు తగలడం.. నవ్వడంపై  మోడీ విమర్శించారు.

ఈ విమర్శలపై ఆమె స్పందించారు. నిజాన్ని నిలబట్టేందుకు తాను ఆ రోజుల సభలో నవ్వినట్టు ఆమె చెప్పారు.  నా నవ్వుతో మోడీ కుమిలిపోయాడన్నారు. ఆనాడు సభలో తనను కించపర్చేలా వ్యాఖ్యానించిన మోడీ ఆ తర్వాత తన కళ్లలోకి సూటిగా చూడలేకపోయారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాను మోడీకి ఎదురెళ్లి మరీ నవ్వినట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. అన్నివర్గాల ప్రజలను  నమ్మించి మోసం చేశారని ఆమె ఆరోపించారు.  టీఆర్ఎస్ సర్కార్ పై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ కారణంగానే  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ముందస్తు ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారని  ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భయం వల్లే టీఆర్ఎస్ నేతలు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. డిసెంబర్ లో తెలంగాణలో  ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు.  కేటీఆర్ కు సీఎం పగ్గాలు ఇచ్చేందుకు కేసీఆర్ ముందస్తు అంటున్నారని చెప్పారు.

కేసీఆర్ కుటుంబానికి బంగారు తెలంగాణ... ఇతరులకు జేబులు కత్తిరించే తెలంగాణగా మారిందని ఆమె చెప్పారు. రోజు రోజూకు టీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనే భయంతో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లేందుకు ఆలోచన చేస్తున్నారని ఆమె చెప్పారు.

టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొనే విషయంలో తన అభిప్రాయాలను పార్టీకి చెబుతానని ఆమె చెప్పారు. టీడీపీతో పొత్తుంటే ఖమ్మం ఎంపీ సీటును  టీడీపీకి ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొంటే  తన అభిప్రాయాలను పార్టీకి స్పష్టం చేస్తానని చెప్పారు. గతంలో కూడ సీపీఐకి ఈ స్థానాన్ని ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 

పొత్తుల వల్ల రేణుకా చౌదరికి నష్టం కల్గించేలా చేయాలని చూస్తే  ఏం జరుగుతోందో చూస్తారని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్న పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్దంగా ఉందన్నారు. 

రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో చూస్తారని ఆమె చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 50 మంది సీఎం పదవికి పోటీ పడుతున్నట్టు ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయమై  పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని  చెప్పారు.

2019 ఎన్నికల్లో  టీఆర్ఎస్‌ను ఓడించేందుకు అవసరమైతే తాను పోటీ చేయకుండా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు ఆమె చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు.

loader