కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అరాచకాలు పెరిగిపోయాయని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని రేణుక వ్యాఖ్యానించారు.  

తెలంగాణలో శాంతి భద్రతలపై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువైపోతున్నాయని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (amit shah) తెలంగాణకు ఎందుకు స్పెషల్ టీం పంపడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా అని ఆమె నిలదీశారు. తెలంగాణలో కేంద్ర బృందం దిగాలని రేణుకా చౌదరి కోరారు. 

రజాకార్లను ఎదుర్కొన్న తెలంగాణ పోలీసులకు దేశంలోనే మంచి గుర్తింపు వుందని ఆమె గుర్తుచేశారు. ప్రభుత్వానికి తొత్తులుగా బతికే పరిస్ధితికి దిగజారారని రేణుకా చౌదరి దుయ్యబట్టారు. పోలీస్ సిబ్బంది ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం (khammam) జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేవని.. నగరంలోని టూటౌన్, త్రి టౌన్‌లలోనే ఇబ్బందులు వస్తున్నాయని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. తాను పరామర్శించడానికి వెళితే 144 సెక్షన్ పెట్టారని రేణుకా మండిపడ్డారు. 

ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రేణుకా చౌదరి. సత్తా ఉంటే అమరావతికి కమ్మరావతి అని పేరు పెట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కు Renuka Chowdhury సవాల్ విసిరారు. Nizambad జిల్లా వర్నిలో గత శుక్రవారం నాడు నిర్వహించిన Kamma సామాజిక వర్గం ఆత్మీయ సమావేశంలో ఆమె ప్రసంగించారు.

అమరావతి విషయంలో ఏపీ సీఎం జగన్ కమ్మ సామాజిక వర్గాన్ని తప్పు పట్టేలా మాట్లాడుతున్నారన్నారు. అంతేకాదు కమ్మ సామాజిక వర్గాన్ని హేళనగా కూడా సీఎం జగన్ మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు.కమ్మ సామాజికవర్గం మంచితనాన్ని బలహీనతగా చూడొద్దని సీఎం జగన్ కు రేణుక చురకలు అంటించారు. రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమేనన్నారు.

కాగా... 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి శంకుస్థాపన చేశరు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకు వచ్చారు. అమరావతి శాసన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా, విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.