రేపు మేడిగడ్డకు రాహుల్ గాంధీ .. బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించే ఛాన్స్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను సందర్శించనున్నారు. ప్రాజెక్ట్ వద్ద పిల్లర్లు కుంగిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. అలాంటిది రాహుల్‌ను , ఇతర కాంగ్రెస్ నేతలను ఆ ప్రాంతానికి అనుమతిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కుంగిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ను సందర్శించనున్నారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన అంబటిపల్లి నుంచి మేడిగడ్డకు రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Also Read: తెలంగాణలో వాళ్లకి పడేదే 2 శాతం ఓట్లు .. ఓబీసీని సీఎంగా ఎలా సాధ్యం : బీజేపీకి రాహుల్ గాంధీ చురకలు
అయితే మేడిగడ్డ ప్రాంతంలో రాహుల్ పర్యటన కొనసాగుతుందా.. లేదా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. ప్రాజెక్ట్ వద్ద పిల్లర్లు కుంగిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి ఎవ్వరినీ అనుమతించడం లేదు. అలాంటిది రాహుల్‌ను , ఇతర కాంగ్రెస్ నేతలను ఆ ప్రాంతానికి అనుమతిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. రేపు ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు అంబటిపల్లి గ్రామంలో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రాహుల్‌తో పాటు రేవంత్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తదితరులు ఆ భేటీలో పాల్గొననున్నారు. సుమారు 5 వేల మంది మహిళలతో ఈ సభ జరగనుంది.. ఆరు గ్యారెంటీ పథకాలపై మహిళలకు రాహుల్ వివరించనున్నారు.