కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు జనగామ టికెట్‌ రాదంటూ జరుగుతున్న ప్రచారం కాంగ్రెస్‌ పార్టీకి మంచిది కాదని పొన్నాల  అన్నారు. ఎన్నికల్లో అనుచిత లబ్ధిపొందాలన్న దురుద్దేశంతోనే తనకు జనగామ టికెట్‌ ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్‌ఎస్‌ ప్రచారం చేయిస్తోందని ఆయన ఆరోపించారు.

శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... జనగామ టికెట్‌ విషయంలో జరుగుతున్న ప్రచారం ఖండించదగిందంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకొనేందుకు ప్రయత్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే బీసీలు రాజకీయంగా తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని, ఇలాంటి సమయంలో ఓ బీసీ సీనియర్‌ నాయకుడి సీటును బీసీయేతర వర్గాలకు కేటాయిస్తే వారికి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు.
 
ఈ ధోరణి వల్ల పార్టీకి చాలా నష్టం జరుగుతుందన్నారు. అధిష్ఠానంపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. గతంలో ఎప్పుడు పొత్తులున్నా.. జనగామ టికెట్‌ కాంగ్రెస్ కే దక్కిందని, ఇది చరిత్ర చెబుతున్న వాస్తవమన్నారు. జనగామను తాను కాంగ్రెస్ కు కంచుకోటగా మార్చానన్నారు.