తెలంగాణ జన సమితిలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి ఆదివారం నాడు చేరారు.
హైదరాబాద్: తెలంగాణ జన సమితిలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి ఆదివారం నాడు చేరారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సేవా దృక్పథం ఉన్నవారు రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామమని అన్నారు.
సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ నిర్వహించే సభకు అధికార యంత్రాంగాన్ని వాడుకోవద్దని ఆయన సూచించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. సభలు ఎవరు పెట్టినా ప్రభుత్వం అనుమతులివ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మర్రి శశిధర్ రెడ్డి తనయుడు తెలంగాణ జనసమితిలో చేరడం కాంగ్రెస్ వర్గాలను షాక్ కు గురిచేసింది. శశిదర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయన తనయుడు తెలంగాణ జనసమితిలో చేరడం ప్రాధాన్యత సంతరించుకొంది.
