దుబ్బాక: కాంగ్రెస్ పార్టీకి  మరో షాక్ తగిలింది. దుబ్బాకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన మద్దూరు నాగేశ్వర్ రెడ్డి  ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు.  మూడు రోజుల క్రితం  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్లు మనోహార్ రావు, నర్సింహ్మరెడ్డిలు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

నర్సింహారెడ్డి, మనోహర్ రావులు కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఆశించారు.  వీరికి కాకుండా మాజీ మంత్రి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. టీఆర్ఎస్ లో టికెట్టు దక్కని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. హుజూర్‌నగర్ లో నిజామాబాద్ లో జరిగిందే.. దుబ్బాకలో జరుగుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు కూడ దక్కవన్నారు.

మీ నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని  ఆయన కోరారు. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందన్నారు. ఆనాడు కరెంట్ ఇవ్వక... నేడు మీటర్లు పెట్టి బీజేపీ రైతులను చంపుతోందని ఆయన విమర్శించారు.కాంగ్రెస్, బీజేపీలు మైక్ ల ముందు పులులు.. పోలింగ్ డబ్బాలు తెరిస్తే వారి పరిస్థితి ఏమిటో తేలిపోతోందన్నారు.