హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపుకుదిపేస్తోంది ఆర్టీసీ కార్మికుల సమ్మె. ఆర్టీసీ సమ్మెకు కారణం ప్రభుత్వ వైఖరే కారణమని విపక్షాలు ఆరోపిస్తుంటే విపక్షాల మాయలోపడి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 

న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం తాము సమ్మె చేస్తున్నామని తమ సమ్మె వెనుక ఏ రాజకీయ శక్తులు లేవని ఆర్టీసీ జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము ఏ రాజకీయ పార్టీకీ కొమ్ముకాయడం లేదని తేల్చి చెప్తున్నారు. 

ఇలాంటి తరుణంలో రంగంలోకి దిగారు టీఆర్ఎస్ పార్టీ అగ్రనేత, పార్లమెంటరీ నేత కె.కేశవరావు. ఆర్టీసీ కార్మికులు సమ్మె వీడి చర్చలకు రావాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే ఆర్టీస ీకార్మికులు, విపక్షాలతో చర్చిస్తానని చెప్పుకొచ్చారు. 

కేకే వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేకేపై ప్రశంసలు కురిపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేకే మాత్రమే మనస్సుతో స్పందించారని మిగిలిన వారికి మనసురావడం లేదని తిట్టిపోశారు. 

సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మెుండివైఖరితో వ్యవహరిస్తున్నారని అది మంచిపద్దతికాదన్నారు. మెుండివైఖరి వీడి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని సూచించారు. సమ్మెతో రాష్ట్రప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 

సమ్మెకు సంబంధించి ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు కేకేకు సీఎం కేసీఆర్ ఎందుకు అవకాశం ఇవ్వడం లేదో చెప్పాలని నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుండా ఇలానే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.