హైదరాబాద్: మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను అభినందిస్తూ ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఇటీవల కూడ కేసీఆర్ ను ఉద్దేశించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. అంతేకాదు చివర్లో సెటైర్లు వేశారు. అభినందిస్తూనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు.కరోనా కేసుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లను  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆదివారంనాడు ప్రశంసలతో ముంచెత్తారు. 

 

కరోనాతో గత 24 గంటల్లో కేవలం 9 మంది మాత్రమే మరణించడం తెలంగాణ ప్రభుత్వం పనితీరును ఆయన అభినందించారు.ఇతర రాష్ట్రాల్లో వేలాది మంది చనిపోతున్నా రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువగానే ఉండడాన్ని ఆయన ప్రస్తావించారు.

కరోనా హెల్త్ బులిటెన్ తో పాటు మంత్రి కేటీఆర్ ఫోటోను కూడ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్వీట్ చేశారు. కరోనా రోగుల చికిత్స కోసం వైద్య సదుపాయాలు, బెడ్స్ సమకూరుస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
గత ఎన్నికల ముందు కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవేళ్ల నుండి మరోసారి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు.