టీపీసీసీ అధ్యక్ష పదవిని పార్టీ అధిష్ఠానం ఎవరికిచ్చినా తామంతా మద్దతు తెలుపుతామని  భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామగ్రామాన కాంగ్రె్‌స్ కి బలమైన క్యాడర్‌ ఉందన్నారు.

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష పదవిని పార్టీ అధిష్ఠానం ఎవరికిచ్చినా తామంతా మద్దతు తెలుపుతామని భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గ్రామగ్రామాన కాంగ్రె్‌స్ కి బలమైన క్యాడర్‌ ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జహీరాబాద్‌కు వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతున్నదని, ప్రజలు ఎంతగానో ఆందోళన చెందుతున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు కొందరు ఐఏఎస్‌ అధికారులను మచ్చిక చేసుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఎఎస్ లు పోస్టులు లేక ఖాళీగా ఉంటే, కేవలం సోమేశ్‌కుమార్‌, రజత్‌కుమార్‌, అరవింద్‌కు మాత్రమే పోస్టింగులు ఇచ్చి వారి ద్వారా దోచుకునేందుకు కుటీల యత్నాలు చేస్తున్నారన్నారు. 

మున్ముందు కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని అప్పుడు కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. రాష్ట్ర సంపాదనను ఆంధ్రా కాంట్రాక్టర్లకు, సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్లకు తరలిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ గెలుపు తాత్కాలికమేనని పేర్కొన్నారు. పీసీసీ చీప్ రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డితో పాటు పలువురి పేర్లు పీసీసీ చీఫ్ రేసులో ఉన్నాయి. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు పూర్తైన తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.