కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తామే చేశామని టీఆర్ఎస్ గొప్పలు చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి విమర్శించారు.
నల్గొండ: కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తామే చేశామని టీఆర్ఎస్ గొప్పలు చెబుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి విమర్శించారు.ఆదివారం నాడు ఆయన నాగార్జునసాగర్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే నాగార్జునసాగర్ అభివృద్ది చెందిందన్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కోసమే నెల్లికల్ లిఫ్ట్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ డ్రామాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు. ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇంతకాలం పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జానారెడ్డి ప్రశ్నించారు.
పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.గత వారంలో నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
త్వరలోనే నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి
