దుబ్బాక, జీహెచ్ఎంసీ తరువాత ఇప్పుడు అందరి చూపూ నాగార్జునసాగర్ వైపే ఉంది. అక్కడి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పనిసరైంది. 

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పేరు చెప్పగానే వెంటనే కాంగ్రెస్ నేత జానారెడ్డి పేరే గుర్తుకువస్తుంది. జానారెడ్డి సుదీర్ఘకాలం పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 

ఎన్నో కీలక పదవులను అధిష్టించారు. దీర్ఘకాలం రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన మంత్రిగా రికార్డ్ సాధించారు. కానీ, గత ఎన్నికల్లో నోముల చేతిలో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు నోముల మృతితో ఉప ఎన్నిక వచ్చిన పరిస్థితిలో అందరూ జానారెడ్డి వైపు చూస్తున్నారు. 

మరోసారి జానారెడ్డి పోటీ చేయడం ఖాయమని అంతా భావిస్తున్న తరుణంలో సంచలన వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి. ఈసారి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని వెల్లడించారు. 

రెండేళ్ల కోసం తాను పోటీచేసి ఏం లాభం అని ప్రశ్నించారు జానారెడ్డి. ఎన్నికల్లో పోటీచేయనని గతంలోనే చెప్పానని, రాహుల్ గాంధీ వచ్చి చెప్పినా తన నిర్ణయం మారబోదన్నారు. 

ఇక, పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కూడా ఆయన తనదైన స్టైల్లో స్పందించారు. పార్టీని విడిచివెళ్లాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. పీసీసీపై తన అభిప్రాయాన్ని ఠాకూర్‌కు చెప్పా, ఏం చెప్పాలో అదిచెప్పాను, పార్టీయే దానిపై నిర్ణయం తీసుకుంటుందన్నారు.