తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నాడని జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ సమర్దిస్తున్నారని మండిపడ్డారు. 

బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తా అన్న కేసీఆర్ ఢిల్లీ యాత్రలో రైతుల దీక్ష వద్దకు ఎందుకు వెళ్ళలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ ఏం ఒప్పందాలు చేసుకున్నారో చెప్పాలని నిలదీశారు. అక్కడికి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ మాటల్లో మార్పు వచ్చిందని అన్నారు. 

ధాన్యం కొనుగోలు భారాన్ని ఎందుకు భరించం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం చేసే ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ రైతుల వెంట ఉంటుందని..రైతులను కాపాడుకుంటుంది అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. 

గత వారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్ష చేస్తున్న రైతులను కలిసి మద్దతు ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే కేసీఆర్ పర్యటనలో రైతులతో కలవలేదు.