టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి హెటిరో పార్థసారథిపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్థసారథి నరహంతకుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో రెమిడిసివర్ దేశమంతా తిరిగిందని అన్నారు.
టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి హెటిరో పార్థసారథిపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్థసారథి నరహంతకుడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో రెమిడిసివర్ దేశమంతా తిరిగిందని అన్నారు. రెమిడిసివిర్ మొత్తం బ్లాక్ దందా జరిగిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతోనే రెమిడిసివిర్ మాఫియా జరిగిందని ఆరోపించారు. ప్రతి ఇంజెక్షన్ రూ. లక్ష వరకు విక్రయించారని అన్నారు. పార్థసారథి వద్ద దొరికిన రూ. 500 కోట్లపై కేసు అయిందా..? లేదా..?అని ప్రశ్నించారు.
పార్థసారథిపై ఐటీ రైడ్‌లో ఏం జరిగిందో ఇప్పటికీ బయటకు రాలేదని అన్నారు. ఐటీ రైడ్‌లో రూ. 10వేల కోట్ల వరకు బయటపడి ఉంటాయనే అనుమానం ఉందని చెప్పారు. పార్థసారథి ఫార్మా స్కాం చేశారని ఆరోపించారు. ప్రతి ఇంజక్షన్ రూ. లక్షకు అమ్మారని.. ఇంత పెద్ద స్కాం చేయడానికి పార్థసారథికి సిగ్గనిపిస్తలేదా అని ప్రశ్నించారు. పార్థసారథి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడారని జగ్గారెడ్డి ఆరోపించారు. అలాంటి వ్యక్తికి టీఆర్ఎస్ రాజ్యసభ సీటు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చాక రెమిడిసివిర్ బాగోతం బయటపెడతామని చెప్పారు.
ఇక, జగ్గారెడ్డి శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ విలువలు పొగొట్టిందని విమర్శించారు. హెటిరో పార్థసారధిని రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారనేది ప్రశ్నార్థకం అని అన్నారు. ఐటీ రైడ్స్‌లో రూ. 500 కోట్ల దొరికిన వ్యక్తికి కేసీఆర్ రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు. పార్థసారథి కరోనా సమయంలో రెమిడిసివర్ తయారు చేసి ప్రజలను దోచుకున్నారని.. ప్రజల రక్తాని పీల్చి కోట్లు సంపాదించారని ఆరోపించారు.
ఆ పైసలతోని కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ లేకుండా చేయాలని దుర్మార్గపు ఆలోచనలతోనే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో ప్రజలు సంతృప్తిగా జీవించడం లేదన్నారు. తెలంగాణలో రైతులు చచ్చిపోతే దిక్కులేదని విమర్శించారు. తెలంగాణ రైతులకు ఇచ్చిన తర్వాత హర్యానా రైతులకు ఇస్తే బాగుంటుందన్నారు.
టీఆర్ఎస్ డబ్బులు పార్థసారథి దగ్గర ఉన్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చేసేందుకే పార్థసారధికి టికెట్ ఇచ్చారని విమర్శించారు. కొంత సెక్యూరిటీ ఉంటం కోసమే పార్థసారథికి రాజ్యసభ టికెట్ ఇచ్చారని విమర్శించారు.
