తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజధాని హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానన్నారని...కానీ ఇక్కడి ఆదాయాన్ని దోచుకుని ఖల్లాస్ చేశారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ద్వజమెత్తారు. ఇలాంటి అక్రమ పాలనకు మరో పదిరోజుల్లో తెలంగాణ ప్రజలు స్వస్తి పలకనున్నారని గూడూరు జోస్యం చెప్పారు. 

ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అరాచకాలను గవర్నర్ నరసింహన్ కూడా పట్టించుకోవడం లేదని అన్నారు. ఆపద్దర్మ ప్రభుత్వ పాలనలో గవర్నర్ కు విశేష అధికారాలు ఉంటాయని వాటిని నరసింహన్ ఉపయోగించడం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించిన ఆరోగ్యశ్రీని పథకాన్ని టీఆర్ఎస్ గాలికొదిలేసిందని ఆరోపించారు. గవర్నర్ గుళ్ళకు తిరిగే బదులు ఆస్పత్రులకు తిరిగితే ఎంత మంది వైద్యం అందక చనిపోతున్నారో తెలుస్తుందని గూడూరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ చేపట్టిన ప్రచారానికి తెలంగాణ ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు. అందువల్ల మరోసారి డిసెంబర్ 3 న రాహుల్ తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తారని...  గద్వాల్‌, తాండూర్‌లో బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అంతేకాకుండా మరోసారి ప్రజా కూటమి భాగస్వామ్య పక్షమైన టిడిపి నాయకుడు, ఏపి సీఎం చంద్రబాబు తో కలసి హైదరాబాద్ లో జరిగే రోడ్ షో లో రాహుల్ పాల్గొంటారని తెలిపారు. ఈ  మేరకు పార్టీ తరపున ఏర్పాట్లు జరుగుతున్నట్లు గూడూరు వెల్లడించారు.