హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ స్పందించారు. కేసును ఏడు రోజులుగా పోలీసులు సాగదీస్తున్నారని .. నిందితులను కాపాడేలా సీపీ సీవీ ఆనంద్ మాటలు వున్నాయంటూ ఆయన  ఆరోపించారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ అత్యాచార ఘటనపై (amnesia pub rape case) మంగళవారం సీపీ సీవీ ఆనంద్ (cv anand) ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చినప్పటికీ విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా టీ.కాంగ్రెస్ (congress) పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ (dasoju sravan) ఈ వ్యవహారంపై స్పందించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసును పక్కదోవ పట్టిస్తున్న అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. 

కేసును ఏడు రోజులుగా పోలీసులు సాగదీస్తున్నారని శ్రవణ్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురించి మాట్లాడుతూ... ఆయన మాటలను వింటుంటే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టనిపిస్తోందని ఆరోపించారు. నిందితులను బాధితురాలు గుర్తు పట్టడం లేదని చెప్పడం దేనికి సంకేతమని శ్రవణ్ ప్రశ్నించారు. నిందితులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా బయటకు వచ్చిన తర్వాత... ఇంకా ఏం ఆధారాలు కావాలని దాసోజు శ్రవణ్ నిలదీశారు. దిశ కేసులో నిందితులను రాత్రికి రాత్రి ఎన్ కౌంటర్ చేశారని... బడాబాబులకు ఒక న్యాయం, పేదోడికి మరో న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.

Also REad{నా మనమడిపై దుష్ప్రచారం:జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ పై హోం మంత్రి మహమూద్ అలీ

తొలుత కారులో ఎమ్మెల్యే కొడుకు లేడని చెప్పారని... అయితే ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత మధ్యలోనే ఎమ్మెల్యే కొడుకు వెళ్లిపోయాడని అంటున్నారని... ఎమ్మెల్యే పేరు చెప్పడానికి కూడా సీవీ ఆనంద్ భయపడుతున్నారని శ్రవణ్ దుయ్యబట్టారు. నిందితులు మందు తాగలేదని పోలీసులు ఎలా చెపుతారని ఆయన ప్రశ్నించారు. ఇందుకోసం ఏమైనా టెస్టులు చేయించారా? అని శ్రవణ్ అడిగారు. ఇంత దారుణం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని ఆయన ఎద్దేవా చేశారు. ట్విట్టర్ లో ప్రతి అంశంపై స్పందించే కేటీఆర్ ఈ ఘటనపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు.. Jubilee hills gang rape ఘటనలో తన మనమడు ఉన్నాడని దుష్ఫ్రచారం చేశారని తెలంగాణ హోంమంత్రి Mahmood Ali చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటన చాలా బాధాకరమని... ఈ తరహా ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ పోలీసులు ఈ కేసును సమర్ధవంతంగా విచారణ చేస్తున్నారని మహమూద్ అలీ ప్రశంసించారు. బుధవారం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పిల్లలపై పేరేంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి కోరారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని మహమూద్ అలీ పేర్కొన్నారు.