హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిల్లీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈటల కుటుంబంపై తోడేళ్ల దాడి జరుగుతోందని... ఆ దాడి నుండి తప్పించుకోడానికే ఆయన డిల్లీ వెళ్లారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోడానికి ఈటల రాజేందర్ నే కాదు ఆయన భార్య, కొడుకు, కోడలిపై కూడా అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని శ్రవణ్ ఆరోపించారు. 

ఇదిలావుంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల రాజేందర్ సోమవారం నాడు భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చర్చలు సఫలమవడంతో వారం రోజుల్లో ఈటల బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు బిజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిలు నడ్డా-ఈటల సమావేశంలో వున్నారు.

read more  నియంత కేసీఆర్ ను గద్దెదించడానికే..: ఈటల బిజెపిలో చేరికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

 బీజేపీలో తన పాత్ర ఎలా ఉండనుందనే విషయమై ఈటల రాజేంర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో చర్చించారు. మరో వైపు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడ నడ్డాతో ఆయన చర్చించారు. బీజేపీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసే విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించారు. 

మంత్రివర్గం నుండి భర్తరఫ్  అయిన తర్వాత నియోజకవర్గంలో తన అనుచరులతో ఈటల రాజేందర్ సమావేశాలు నిర్వహించారు. బీజేపీలో చేరే విషయమై చర్చించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు పలువురు కీలక నేతలతో ఈటల రాజేందర్ చర్చించారు. బీజేపీలో చేరికకు రాష్ట్ర నాయకత్వం కూడ సానుకూలంగా స్పందించింది. ఈ విషయమై జాతీయ నేతలతో కూడ బండి సంజయ్ చర్చించారు. జాతీయ నాయకత్వం కూడ ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.