హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మంత్రి కేటీఆర్ కి చేసిన సవాల్‌లో భాగంగా గన్ పార్క్ వద్దకు తెలంగాణ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ శుక్రవారం నాడు వచ్చారు. టీఆర్ఎస్ నేతల కోసం ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 2014 నుండి 2019 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో కేవలం 10 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేశారని కేటీఆర్ ఆరోపించారు. 

ఇదిలా ఉంటే రాష్ట్రంలో తమ ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని చేసిన ప్రకటనకు అనుగుణంగా  ఈ నెల 25న మంత్రి కేటీఆర్ శాఖలవారీగా భర్తీ చేసిన పోస్టుల జాబితాను కేటీఆర్ విడుదల చేశారు. 

ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఈ విషయమై సవాల్ కు కాంగ్రెస్ సిద్దమని తేల్చి చెప్పింది. కేటీఆర్ చేసిన ప్రకటనపై తాను బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ రెండు రోజుల క్రితం ప్రకటించారు.

ఈ నెల 26వ తేదీన గన్ పార్క్ వద్ద  చర్చకు రావాలని శ్రవణ్ ప్రకటించారు. ఈ సవాల్ లో భాగంగా గన్ పార్క్ వద్దకు శుక్రవారం నాడు శ్రవణ్ కుమార్ వచ్చారు.  గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద శ్రవణ్ కు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.తనతో చర్చ కోసం టీఆర్ఎస్ నేతల కోసం శ్రవణ్ కుమార్ గన్ పార్క్ వద్ద ఎదురు చూస్తున్నారు.