తెలంగాణలో వచ్చే వారం జరగనున్న ఎన్నికల్లో తమ మహాకూటమి కచ్చితంగా గెలుస్తుందని మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. మధరిలో శనివారం భట్టి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయనతోపాటు కాంగ్రెస్ మహిళా నేత విజయ శాంతి, ప్రజా గాయకుడు గద్దర్, సీనియర్ నేత వీహెచ్, మధిర పార్టీ ఇంఛార్జ్ వాసిరెడ్డి రామనాథం తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... మధిరలో ఈ సారి ఎన్నికల్లో 40వేల మెజారిటీతో గెలుస్తానని భట్టి ధీమా వ్యక్తం చేశారు. 2009లో ఇక్కడ నుంచి తొలిసారి పోటీ చేసినప్పుడు.. మధిరలో చందాలు, దందాలు లేకుండా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని భట్టి విక్రమార్క చెప్పారు. ఎవరు.. ఎవరికి భయపడకుండా స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకునే స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించినట్లు ఆయన చెప్పారు. 

నియోజకవర్గ అభివృద్ధితో పాటు మధిర పట్టణ అభివృద్ధి కోసం పదేళ్లుగా ఎంతో కృషి చేసినట్లు ఆయన చెప్పారు. ఆదిలాబాద్ నుంచి.. ఖమ్మం వరకు యావత్ తెలంగాణ మొత్తం కేసీఆర్  ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని భట్టి అన్నారు.ఈ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రాగానే.. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తానని ఈ సందర్భంగా భట్టి హామీ ఇచ్చారు.