జైపూర్: ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదనీ ప్రతి ఒక్క పౌరుడు విధిగా నిర్వహించాల్సిన నైతిక బాధ్యత అని రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ఆయన ట్విట్టర్లో స్పందించారు. 
 
ముందుగా ఓటర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటును ఉపయోగించుకోవడం పౌరులకు దక్కే గొప్ప గౌరవంమని కొనియాడారు. మీకోసం మీరు ఓటు వేయండి. అందరినీ ఆ దిశగా ప్రోత్సహించండి. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు. 

ఇది మీ నైతిక బాధ్యత కూడా అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో మీరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను అంటూ సూచించారు. రాజస్థాన్ ఎన్నికల బరిలో అశోక్ గెహ్లాట్ సర్దార్ పురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

 

అశోక్ గెహ్లాట్ జోధ్ పూర్ లోని పోలింగ్ బూత్ నంబర్ 106లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి రేసులో గెహ్లాట్ ముందు వరుసలో ఉన్నారు.