కోమటిరెడ్డి, వివేక్ వెంకటస్వామిలపై ఆపరేషన్ ఆకర్ష్: పార్టీలో చేరాలని కాంగ్రెస్ ఆహ్వానం

బీజేపీలోని కొందరు నేతలను తమ పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలను హస్తం నేతలు తమ పార్టీలో చేరాలని కోరుతుంది.

 Congress Invited Komatireddy Rajagopal Reddy and Vivek venkataswamy into Party lns


హైదరాబాద్: బీజేపీలోని  కొందరు నేతలను తమ పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఇతర కారణాలతో బీజేపీలో చేరిన నేతలను  తిరిగి స్వంత గూటిలో చేరాలని హస్తం పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు.  మునుగోడు మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  మాజీ ఎంపీ  వివేక్ వెంకటస్వామిని కూడ  కాంగ్రెస్ లో చేరాలని కాంగ్రెస్ నేతలు  ఆహ్వానం పలుకుతున్నారని ప్రచారం సాగుతుంది.  మంగళవారం నాడు సాయంత్రం  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు సమావేశం కానున్నట్టుగా  సమాచారం.  

ఈ నెల  22న బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు టిక్కెట్లు దక్కలేదు.  మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేయాలని క్యాడర్ ఒత్తిడి తెస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  నిన్న మీడియాకు చెప్పారు.  అయితే  ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రెండు మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కుటుంబానికి ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది.వివేక్ వెంకటస్వామి కుటుంబానిది కూడ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు,రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలు  కాంగ్రెస్ ను వీడారు. 

కేసీఆర్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదే పదే ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులు బీజేపీలో పరిణామాలతో  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహా కొందరు నేతలు  అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. 

మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా  సీపీఐ  కోరుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలో చేరితే మునుగోడును ఆయనకు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున సీపీఐకి  కాంగ్రెస్ పార్టీ చెన్నూరును కేటాయించిందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

చెన్నూరు, ధర్మపురిలలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని  వివేక్ వెంకటస్వామి  భావించారు. రెండు రోజుల క్రితం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ధర్మపురి స్థానాన్ని బీజేపీ ప్రకటించింది. కానీ చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని మాత్రం  బీజేపీ ప్రకటించలేదు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  వివేక్ వెంకటస్వామిలు ఇవాళ సాయంత్రం  సమావేశం కానున్నారు.  ఈ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో చేరే విషయమై స్పష్టత రానుందనే ప్రచారం సాగుతుంది. ఈ ఇద్దరితో పాటు బీజేపీలో ఉన్న మహిళా నేతను కూడ కాంగ్రెస్ లోకి  హస్తం నేతలు ఆహ్వానిస్తున్నారని సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios