ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పీవీ నరసింహారావు, ప్రణబ్ ముఖర్జీలపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను అధిష్టానం తప్పుపట్టింది. ఆయన చేసిన కామెంట్స్ పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

దీంతో చిన్నారెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ అంతర్గత విషయాలు బీజేపీకి ఎందుకు అని మాత్రమే తాను అన్నానని, పీవీ, ప్రణబ్ లను అవమానించే ఉద్దేశ్యం తనకు లేదని చెప్పారు. ఈ విషయంలో కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయని వివరించారు. 

తన మాటలకు ఎవరైనా బాధపడితే చింతిస్తున్నానని, పీవీ, ప్రణబ్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. వాళ్లు గొప్ప మేధావులు కావడం వల్ల కాంగ్రెస్ వారికి ఎంతో గౌరవం ఇచ్చిందని, పీవీ, ప్రణబ్‌లను కాంగ్రెస్ అవనించిందని మోడీ అనడం రాజకీయ లబ్ది కోసమేనని చిన్నారెడ్డి విమర్శించారు.