తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారారు.
తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారని.. ఇందుకు సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కూడా ఈ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు కాంగ్రెస్‌లో తన పార్టీ విలీనానికి సంబంధించి షర్మిల విధించిన గడువు శనివారం (సెప్టెంబర్ 30) ముగిసిన నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనని ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారు.
సెప్టెంబర్ 30వ తేదీలోపు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని షర్మిల వారం రోజుల క్రితం ప్రకటించారు. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి గానీ, షర్మిల నుంచి గానీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి షర్మిలకు పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. నాలుగైదు రోజుల్లో షర్మిలను కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీకి ఆహ్వానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీల సమక్షంలో వైఎస్సార్‌టీపీ విలీనానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే ఆ వర్గాలు చెబుతున్నాయి.
ఇక, పాలేరు నుంచి పోటీ చేస్తానని చెబుతున్న షర్మిల కూడా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు బదులుగా లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం ముందు ఉంచే ఆలోచనలో షర్మిల ఉన్నట్టుగా తెలుస్తోంది.
అయితే షర్మిల పార్టీ విలీనానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. తెలంగాణలోని పార్టీ నేతలు కొందరు మాత్రం వ్యతిరేకతతో ఉన్నట్టుగా తెలుస్తోంది. షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే.. తెలంగాణ స్థానికత విషయంలో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని, అందుకే ఆమె సేవలను ఏపీకి పరిమితం చేయాలని కోరుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో టీ కాంగ్రెస్ నాయకుల ప్రమేయం లేదని.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారానే కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలాఉంటే, వైఎస్‌ఆర్‌టీపీని తమ పార్టీలో విలీనం చేసే విషయంలో ఎలాంటి పురోగతి లేదని, పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్‌ఆర్‌టీపీతో పొత్తు లేదా విలీనానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటున్నారు.
