రేవంత్ నేతృత్వంలో ప్రజల సర్కార్: రాహుల్ గాంధీ
తెలంగాణలో ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణలో ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరును కాంగ్రెస్ నాయకత్వం ఈ నెల 5వ తేదీన ఖరారు చేసింది. కాంగ్రెస్ నాయకత్వం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి నిన్న రాత్రి హైద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం నుండి కాంగ్రెస్ అగ్రనేతలను వరుసగా కలుస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేతగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 5వ తేదీన ఎంపిక చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ ఈ విషయాన్ని మీడియా వేదికగా ప్రకటించారు. నిన్న రాత్రే న్యూఢిల్లీకి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. బుధవారంనాడు ఉదయం కే.సీ. వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
also read:Anumula Revanth Reddy: రేవంత్ కేబినెట్ లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు: ఛాన్స్ వీరికే
నిన్న మల్లు భట్టి విక్రమార్క, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డితో జరిగిన చర్చల సారాంశాన్ని కే.సీ. వేణుగోపాల్ వివరించారు . ఈ భేటీ ముగిసిన తర్వాత మల్లికార్జున ఖర్గే తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఖర్గేతో భేటీ ముగిసిన తర్వాత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణ సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డిన అభినందించినట్టుగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. మరో వైపు తెలంగాణలో ప్రజల సర్కార్ ఏర్పాటు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని అభినందించిన ఫోటోలను సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ షేర్ చేశారు.