తెలంగాణలో మాజీ ఎమ్మెల్యే ఓటు గల్లంతైంది. ఆయనదే కాదు ఆయన సతీమణి ఓటు కూడా గల్లంతైపోయింది. దీంతో ఆ మాజీ ఎమ్మెల్యే అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగిందేమోనని ఆ మాజి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ ఏ మాజీ ఎమ్మెల్యే ఓటు గల్లంతైంది..? ఎందుకు అయిందో తెలుసుకోవాలంటే చదవండి స్టోరీ.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికల ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన జరిగింది. కానీ ఈ ఓటర్ లిస్ట్ ప్రక్షాళన షాకింగ్ ట్విస్ట్ లు ఇస్తోంది. ఏకంగా ఎల్ బి నగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆయన భార్య ఓటు గల్లంతైంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో దుమారం రేగుతోంది.

గ్రేటర్ పరిధిలో ఓట్ల గల్లంతుపై మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో దురుద్దేశపూర్వకంగా గ్రేటర్ పరిధిలో 17 లక్షల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఓటర్ల ప్రక్షాళన చేసిన ఏజెన్సీ వెనుక అధికార పార్టీ కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. జనాల ఓట్లే కాదు.. ఏకంగా సీనియర్ నేతల ఓట్లు కూడా తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్ల ప్రక్షాళన అనేది పెద్ద బోగస్, పెద్ద స్కాం అని ఆరోపించారు. జీహెచ్ఎంసీ లోనున్న ఇతరులు కంప్యూటర్ లు ఉపయోగించి ఓట్లను తొలగించారు కానీ ఇంటింటికి వెళ్లి సర్వే చేయలేదన్నారు. హైద్రాబాద్ లో టీఆర్ఎస్ వీక్ గా ఉందని దురుద్దేశం తో ఇలాంటి ప్రయత్నం చేశారని ఆరోపించారు. సిటీ లో ఉన్న అపార్ట్మెంట్ పేర్లు కూడా గల్లంతు చేశారని విమర్శించారు. 

ఓట్ల గల్లంతుపై మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి తాను ఓటు వేస్తున్నానని.. తన ఓటు, తన భార్య ఓటు ఎలా తొలగించారని ఆయన నిలదీశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు చెప్పారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.

మొత్తానికి సరికొత్త వివాదం జిహెచ్ఎంసి పరిధిలో షురూ అయింది.