ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.  టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీంతో నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇల్లందు ఎమ్మెల్యే భానోతు హరిప్రియ కోయగూడెం గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ప్రచారాన్ని గ్రామంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. 

తమ ఎమ్మెల్యేను అడ్డుకుని అవమానించారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టేకుపల్లి టీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని కుర్చీలు, ప్లెక్సీలతో పాటు ఇతర పర్నీచర్ కూడా ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా టేకుపల్లి టీఆర్ఎస్ అభ్యర్థికి చెందిన ప్రచార వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. 

దీంతో ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘర్షణలపై  సమాచారం అందుకున్న పోలీసులు టేకుపల్లి గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మళ్లీ ఎలాంటి ఉద్రిక్తతలు చెలరేగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.