కెసిఆర్ కు అవార్డు అనగానే అభినందిస్తారా? ప్రయివేటు కంపెనీలు అవార్డులిస్తే గవర్నర్ స్పందిస్తారా? స్వామినాథన్ తెలంగాణ రైతులను కలిస్తే కష్టాలు తెలుస్తాయి కెసిఆర్ కు అవార్డు రావడం మిలీనియం జోక్ అవార్డు తీసుకునే అర్హత కెసిఆర్ కు ఉందా?
గవర్నర్ నర్సింహ్మన్ పై గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. గవర్నర్ తీరుపై బహిరంగంగానే మండిపడింది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవన్ గవర్నర్ తీరును ఎండగట్టారు.
కెసిఆర్ కి వ్యవసాయ లీడర్ అవార్డు రావడం మిలినియం జోక్ అని శ్రవణ్ అభిప్రాయపడ్డారు. ఇచ్చినోడికి లేకపోయినా, తీసుకోవడానికి అయినా సిఎంకు ఇంగితం ఉండాలని ఎద్దేవా చేశారు శ్రవణ్. వ్యవసాయాన్ని కుదేలు చేసిన ఘనత సీఎం కెసిఆర్ కె దక్కుతుందన్నారు. సిఎం కెసిఆర్ పై శ్రవణ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏక కాలంలో రుణ మాఫీ చేశామని అవార్డు తీసుకుంటున్నారా?
చనిపోయిన రైతు కుటుంబాలను పరమర్శించనందుకు అవార్డు తీసుకుంటున్నారా?
రైతులకు మద్దతు ధర ఇవ్వనందుకా అవార్డు?
నకిలీ విత్తనాలు అరికట్టనందుకా మీకు అవార్డు?
ఖమ్మం లో రైతులకు బేడీ లు వేసినందుకా అవార్డు తీసుకుంటున్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత అవార్డు తీసుకోవాలి అని సిఎంకు సవాల్ విసిరారు.
సందుట్లో సడేమియా అన్నట్లు ఇక పనిలోపనిగా గవర్నర్ పైనా విమర్శలు గుప్పించారు దాసోజు శ్రవణ్. ఒక ప్రయివేటు కంపెనీ అవార్డు ఇస్తే తగుదునమ్మా అని గవర్నర్ శుభాకాంక్షలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వామినాథన్ ఒక్కసారి తెలంగాణ వచ్చి రైతులతో మాట్లాడితే రైతుల సమస్య తెలుస్తుందన్నారు. రైతుల పరిస్థితి ఫై కాంగ్రెస్ పక్షాన స్వామినాథ్ కి లేఖ రాస్తామన్నారు శ్రవణ్.
