New Cabinet : కొత్త మంత్రులు వీరేనా..? మరీ ప్రమాణ స్వీకారం ఎప్పుడు?
New Cabinet : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీని గద్దెదించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ నూతన కేబినేట్ లో మంత్రులెవరు? ఎవరెవరికి చోటు దక్కనున్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
New Cabinet : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఈ విజయంతో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుని నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో నూతన మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు లభించనున్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రమాణస్వీకార ప్రక్రియ కాస్త ఆలస్యమవుతోంది. దీంతో సీఎం ప్రమాణ స్వీకారంతోపాటే.. మంత్రివర్గం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో నూతన ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ పడుతున్నా..రేవంత్‌కే అధిష్టాన అనుగ్రహం ఉన్నట్టు, సీఎం పీఠాన్ని ఆయనకే అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కాకుండా మరో 16 మందికి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నూతన మంత్రివర్గ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ అధిక సీట్లను గెలుపొందింది. ఈ నేపథ్యంలో గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం గలవారికి, అలాగే గతంలో ఎంపీలుగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారికి నూతన మంత్రి వర్గంలో స్థానం కల్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వారికి నూతన మంత్రి వర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమసాగర్‌రావు లకు.. నిజామాబాద్ నుంచి సుదర్శన్‌రెడ్డి, కరీంనగర్ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ లను నూతన మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ల విషయానికి వస్తే.. జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి ఓడిపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియార్టీ పరంగా ఆయనను నూతన మంత్రివర్గంలోకి తీసుకోనున్నారంట. ఇటు మెదక్ జిల్లా నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పేరు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
మహబూబ్‌నగర్ విషయానికి వస్తే.. జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ పేర్లతోపాటు శంకర్( షాద్ నగర్ ) పేరును కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇక రంగారెడ్డి జిల్లాలో గడ్డం ప్రసాద్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామమోహన్‌రెడ్డిలకు అవకాశం కల్పించనున్నారంట. ఇక నల్గొండ జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ల పేర్లను లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. ఉత్తమ్ మంత్రి పదవి చేపట్టడానికి ఆసక్తి చూపకపోతే ఆయన భార్య పద్మావతికి అవకాశం కల్పించనున్నారంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో స్పీకర్ గా ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.