ఎన్నికలకు ముందు లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లాభం చేయకపోగా తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆదిలాబాద్ జిల్లా బొథ్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు సోయం బాపురావు ఆరోపించారు. ముఖ్యంగా బోథ్ నియోజకవర్గంలో ఓటర్లను ఈ సర్వే గందరగోళానికి గురిచేసి తన ఓటమికి కారణమయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ఓటమికి గల కారణాలను సమీక్షించుకునేందుకు ముఖ్య నాయకులు, కార్యకర్తతో బాపురావు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ....లగడపాటి  సర్వేపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పోలింగ్ కు పదిరోజుల ముందు టికెట్లు ఖరారు చేయడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణమన్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడానికి సమయం లేకపోవడంతో ప్రజలను నేరుగా కలవలేక పోయామని...దీంతో ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లారని బాపురావు వెల్లడించారు.

ప్రస్తుతం వన్డే మ్యాచ్ లాంటి అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయని... టీ20 లాంటి స్థానిక సంస్థల ఎన్నికలు మిగిలాయని పేర్కొన్నారు. బ్యాలెట్ పద్దతిలో జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో టీఆర్ఎస్ నాయకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కాబట్టి గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు మరోసారి కష్టపడి నియోజకవర్గ స్థాయిలో అధికంగా  సర్పంచ్ లు, ఎంపిటిసి, జడ్పిటీసిలు గెలిపించుకోవాలని బాపురావు సూచించారు.